Monday, March 10, 2014

నాతోటలో గులాబి




                                     


తన నటనతో మన మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి సావిత్రి గారి గురించి ఎందరో తమ తమ బ్లాగుల్లో రాసాకా చాలా ఆలస్యంగా ఈ పోస్ట్ పెడుతున్నాను. నాన్నగారి వల్ల పాత సినిమాలు చూడటం అలవాటు చేసుకున్న నాకు ఇప్పుడు అదో వ్యసనంగా తయారయింది. అందరినాయికల్లోకి నాటికీ, నేటికీ, ఏనాటికీ మన మనస్సుల్లో దేవతగా నిలిచిపోయిన  మహానటి సావిత్రి గురించి నాకు తెలిసినంత. 

సృష్టిలో అందాలన్నీ తెచ్చి పోతగా పోసి సావిత్రిగా మలిచి ఉంటాడా దేవుడు. ఆమె రూపాన్ని మరింత అందంగా వర్ణించలేకపోతున్నందుకు, నేను కవిని కానందుకు, మొదటి సారిగా బాధ పడుతున్నాను. ఆమె ఎవరో, ఏమిటో తెలియని చిన్నతనం నుండీ ఆ రూపం నాకు పరిచయస్తురాలే అనిపించింది.


ఆ అందాలరాశి అందమంతా ఆ కళ్ళలోనే ఉంది. ఆ తెల్ల కలువల్లాంటి కళ్ళు మన కెన్నో ఊసులు చెపుతాయి. నేటి తరం నాయికలకు ఆదర్శం సావిత్రి. ఆమె స్థానాన్ని ఇప్పటి వరకు అందుకున్న తారలు లేరు. దేవదాసు, నాదీ ఆడజన్మే, మయా బజార్, మిస్సమ్మ, పాండవ వనవాసం, ఆరాధన, గుండమ్మ కథ, నర్తనశాల......మొదలైన చిత్రాలు సావిత్రిలోని నటనకు గీటురాళ్ళు. తను నటించిన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి నటించింది. కనుకనే ఆపాత్రలు ఇంకా సజీవంగా మన హృదయాల్లో ఉండిపోయాయి. మిస్సమ్మలో మేరి(మహా లక్ష్మి), పాండవ వవవాసంలో (దౌపతి), గుండమ్మ కథలో (లక్ష్మి)పాత్రలు మనస్సులో నిలిచిపోయాయి. 

ఆమె కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు, తనలోని ప్రతిభను నిర్మాతగాను, దర్శకురాలిగా మారి నిరూపించుకుంది సావిత్రి. సావిత్రికి దానగుణం కూడా ఎక్కువేనట. ఆమె జీవితంతో ఎలా గెలవాలని ఓడిపోయిందో అందరికీ తెలుసు, అది చెప్పి అందరి మనసులు బాధ పెట్టలేను.(నా మనసు కూడా).

ఆమె నటించిన చిత్రాలు చూసిన ప్రతి సారీ ఇంత గొప్ప అందం మనం జీవిస్తున్న ఈ లోకంలో పుట్టిందా, నేను పుట్టేనాటికి ఆమె వేరే లోకంలో నటించడానికి వెళ్ళిందంటే ఆమెను స్వయంగా కలుసుకోలేనందుకు బాధ పడుతున్నాను. 









నా తోటలోని పూసిన సావిత్రి అనే పుష్పం ఎన్నటికీ వసివాడదు. దాని సుగంధాలు నా వనాన్నే కాదు నా మనసు లోనూ ఎప్పుడూ గుభాళిస్తూనే ఉంటాయి. ప్రతీ వారం పాత చిత్రాల గురించి తెలుపుతాను.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...

No comments:

Post a Comment