Tuesday, March 18, 2014

అమ్మమ్మ కథ కీలుగుర్రం










  • చిత్రం పేరు - కీలుగుర్రం
  • నిర్మాత, దర్శకులు - శ్రీ మీర్జాపురం రాజా వారు
  • సహాయ దర్శకుడు - యం.కొండయ్య
  • కథ, మాటలు, పాటలు - తాపీ ధర్మారావునాయుడు
  • తారాగణం -అంజలీదేవి, నాగేశ్వరరావు, ఏ.వి.సుబ్బారావు, రేలంగి , కనకం, సురభి కమలాబాయి, జూనియర్ లక్ష్మీరాజ్యం తదితరులు..........
  • సంగీత దర్శకుడు - ఘంటసాల వెంకటేశ్వరరావు
  • నేపథ్య గాయకులు -సి.కృష్ణవేణి, ఘంటసాల, పి.లీల, వి.సరళ, శ్రీదేవి
  • నిర్మాణ సంస్థ - శోభనాచల పిక్చర్స్
  • పంపిణీ సంస్థ---చమ్రియా టాకీ డిస్టిబ్యూటర్స్, యశోధర ఫిలిం కార్పరేషన్
  • విడుదల తేది - ఫిబ్రవరి19, 1949

ఇది జానపద చిత్రకథ. అనగనగా ఒక రాజు అని మా అమ్మమ్మ కథ మొదలు పెట్టిందంటే చాలా ఆశక్తిగా పిల్లలందరం ఆమె చుట్టూ చేరి కథ మొత్తం అయ్యే వరకూ పడుకునే వాళ్ళంకాదు..  రాజు వేటకి వెళ్ళడంతో  కథ మొదలవుతుంది. ఒక  రాక్షసి (అంజలీదేవి) మొహినిలా మారి రాజుని ప్రేమించి పెళ్ళి చేసుకుని రాజుగారితో రాజ్యానికి  వచ్చి రెండవ భార్యగా ఉంటూ,  రాత్రివేళల్లో రాక్షసిగామారి ఏనుగుల్ని చంపి తిని ఆ నేరాన్ని పెద్ద రాణిపై వేస్తుంది. అది నమ్మిన రాజు, గర్భవతి అయిన పెద్ద రాణిని చంపేయమని అడవికి పంపిస్తాడు. అడవిలో నిండు చూలాలిని చంపడానికి చేతులురాని బంట్లు ఆమె కళ్ళను పీకి వాటిని రాణీకి గుర్తుగా తీసుకు వస్తారు. పెద్ద రాణికి కోయగూడెంలో ఆశ్రయం దొరుకుతుంది. అక్కడే ఓ మగ బిడ్డను ప్రశవిస్తుంది. అతడే (అక్కినేని) , అక్కడే పెరిగి అన్ని విద్యలలో ప్రవీణుడౌతాడు. చిన్ననాడే అపహరణకు గురైన రాకుమారిని పట్టి తెస్తే అర్థరాజ్యం, కుమాత్తెను ఇస్తానని పొరుగురాజు ప్రకటనను అనుసరించి చాలా శ్రమించి ఓ కీలుగుర్రాన్ని తయారుచేస్తాడు ఓ పండితుడు. వయసు మీద పడిన ఆ పండితుడు, దాన్ని అధిరోహించి రాకుమారిని తేగల సాహసవంతుని కోసం ఎదురుచూస్తాడు. అతడే మన కథానాయకుడు అక్కినేని. ఆకాశంలో విహరించే కీలుగుర్రాన్ని అధిరోహిస్తాడు. దొంగలబారి నుండి కథానాయిక (లక్ష్మీరాజ్యం) ను కాపాడతాడు. తండ్రి రాజ్యంలోనే సేనానిగా చేరతాడు. అతడిని చూసిన రాజు మనసు ఏదో తెలియని మమకారానికి లోనౌతుంది.ఈ సంగతి తెలిసిన మోహిని తనకు తలనొప్పిగా వుందని అందుకు తగిన మందు తెమ్మని కథానాయకున్ని పంపుతుంది. కీలుగుర్రం సహాయంతో ఆ మందు తెచ్చే ప్రయత్నంలో ఎన్నో సాహసాలు చేస్తాడు కథానాయకుడు. ఆ మందు కంటే విలువైన రాక్షసి ప్రాణాలు చిన్న పురుగులో వుండడం గమనించి వాటిని సంగ్రహిస్తాడు. తల్లిని ఉరి తీసే సమయానికి ఆమె కళ్ళతో సహా అక్కడకు వచ్చి రాక్షసిని అంతమొందిస్తాడు. తల్లికి తిరిగి రాజరిక ప్రవేశం కలిగిస్తాడు. కథ సుఖాంతం అవుతుంది. 

ఇందులో పాటలు ఎనిమిది ఉన్నా అన్నింటికంటే నాకు" కాదు సుమా కల కదు సుమా" చాలా నచ్చిన పాట.




నాగేశ్వరరావు నటనకంటే నాకు అంజలీదేవి నటన చాలా చిత్రంగా ఆమె హావభావాలతో రాక్షసి అంటే ఇలానే ఉంటుందేమో అనేట్టుగా చిన్నవయసులో అనిపించేది. ఆమె నటనతో ఏ పాత్రకైనా ప్రాణం పోయగలదు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇలా అన్నీ మయలతో ఆశక్తిగా సాగే కథ,  మా చిన్ననాటి నుండీ మా హృదయాల్లో ఓ సినిమాగా కాక ఓ రాజుగారి కథగా మిగిలిపోయింది. పెద్దయ్యాకా సినిమా చూస్తుంటే అమ్మమ్మ చెప్పిన తీరుకు ఏ మాత్రమూ భిన్నంగా అనిపించలేదు. అంతగా నన్ను ఆకర్షించిందీ కీలుగుర్రం.


మళ్ళీ వచ్చేవారం మరో సినిమాతో కలుద్దాం... 


2 comments:

  1. మీ బ్లాగ్ల్ లో పాతసినిమాల గురించి పరిచయం బాగుంది. మీకు పాత సినిమాల మీద ఉన్న అభిరుచి నచ్చింది. అంతా కొత్త సినిమాల మీద వ్రాస్తుంటే మీరు పాత సినిమాలను ఎంచుకోవడం నాకు నచ్చిన అంశం. మరిన్ని పాత సినిమాలు పరిచయం చేయాలని కోరుతూ..........

    భార్గవి.

    ReplyDelete
  2. నా బ్లాగ్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బార్గవి గారు.

    ReplyDelete